ఇటీవల ప్రతి ఏటా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. తొలుత కలరా, మలేరియా, చికున్ గున్యా ప్రజల్ని వణికించాయి. ఆ తదుపరి డెంగీ, స్వైన్ ఫ్లూ, జికా వంటివి ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి. ఈ వ్యాధులు, జ్వరాలన్నీ రాష్ట్రంలోకి ప్రవేశించి వెళ్లినవే. తాజాగా నిపా వైరస్ పేరు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. 1998లో మలేషియాలో కంబన్ సుంగై వద్ద ఈ నిపా వైరస్‌ను గుర్తించారు. 2004లో ఇది బంగ్లాదేశ్‌ను వణికించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. గబ్బిలాలు, గుడ్ల గూబలు, పందుల ద్వారా ఈ వైరస్ సోకుతున్నట్టుగా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు పదిమందికి పైగా మరణించినట్టు, మరెందరో ఈ వైరస్ బారిన పడ్డట్టుగా సమాచారం. దీంతో కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల ప్రజల్లో ఆందోళన బయలుదేరింది.
సాక్షి, చెన్నై : నిపా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. కేరళలో ఈ వైరస్ బారిన పడి పదిమందికి పైగా మరణించిన సమాచారం సరిహద్దు వాసుల్ని ఆందోళనలో పడేసింది.
అప్రమత్తం చేస్తూ ఆదేశాలు
నిపా వైరస్ బారిన పడ్డ వారికి తొలుత శ్వాస సమస్య తలెత్తుతుంది. తల∙నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే. ఈ దృష్ట్యా, సరిహద్దుల్లో ఎవరైనా శ్వాస సమస్య, తలనొప్పితో బాధపడుతుంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా కన్యాకుమారి, తేని, తిరునల్వేలి, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, డైరెక్టర్ కులందై స్వామి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్వాస సంబంధిత, తలనొప్పి, జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే తక్షణం వారికి వైద్య సేవలు అందే రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలు సాగించాలని, సరిహద్దుల్లో వైద్యు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేరళ నుంచి ఎవరైనా జ్వరంతో ఇక్కడికి వచ్చినా, వస్తున్నా తక్షణం వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిపా వైరస్ తమిళనాడులోకి ప్రవేశించకుండా ప్రజా ఆరోగ్య సంరక్షణ నిమిత్తం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలని, పందుల పెంపకందారులకు కఠిన హెచ్చరికలు ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాధి ప్రభావం మెదడు మీద పడ్డ పక్షంలో మనిషి జీవించడం అరుదే.
ఆందోళన వద్దు
నిపా వైరస్ ఆందోళన వద్దని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ భరోసా ఇచ్చారు. ఈ వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇది కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉందన్నారు. సరిహద్దు జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఇక్కడ ఆ వైరస్ ప్రవేశించలేదని,ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేరళలోని కోలికోడ్, మలపురం పరిసరాల్లో ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారని, వారి రక్త నమూనాలను పరిశోధనలకు పంపించి ఉన్నారన్నారు.
కేరళ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ సరిహద్దుల్లో వైద్య పరీక్షలు చేయిస్తారన్నారు. డైరెక్టర్ కులందై స్వామి పేర్కొంటూ, నిఫాను కట్టడి చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తిన వద్దని సూచించారు. ఈ నిఫా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తించిన పక్షంలో ప్రత్యేక చికిత్సతో నివారించ వచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment