తిరువనంతపురం : అసలే పిల్లలు, దీనికితోడూ లాక్‌డౌన్. స్కూల్లు కూడా లేకపోవడంతో రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో తల్లిదండ్రుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇంటి చుట్టు పక్కల ఉండే తొట్టి గ్యాంగులు, కొందరు చిన్నారులను తమతో కలుపుకోకుండా వారే ఆటలాడుకుంటుంటారు. సరిగ్గా ఇలాంటి తొట్టి గ్యాంగుపైనే చిర్రెత్తుకొచ్చిన కేరళకు చెందిన ఓ ఎనిమిదేళ్ల బుడతడు ఉమర్ నిదార్ పోలీసులను ఆశ్రయించాడు. ఐదుగురు అమ్మాయిలు అన్ని ఆటలు వారే ఆడుకుంటున్నారని, వారితో ఒకవేళ ఆడిపించుకున్నా తనను బెదిరిస్తూ, తక్కువ ప్రాధాన్యతనిస్తూ వివక్షకు గురి చేస్తున్నారని, వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆ తొట్టి గ్యాంగ్‌లో తన సోదరి కూడా ఉండటం విశేషం.
ముందుగా తన తండ్రి వద్ద ఈ విషయమై ప్రస్తావిస్తే, పోయి పోలీసులకు చెప్పరా... అని సరదాగా అన్నాడు. దీన్ని కాస్తా సీరియస్‌గా తీసుకున్న బుడతడు పోలీసుల ఎదుట తన బాధను వెళ్లబోసుకున్నాడు. నేను అబ్బాయిని కాబట్టి వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. లూడో, షటిల్ (బ్యాడ్మింటన్), దొంగా పోలీసు ఆటలను వారితో ఆడటానికి నిరాకరిస్తున్నారని ఉమర్ నిదార్ పోలీసులకు చెప్పాడు. దీంతో కాస్బా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు యూపీ ఉమేష్, కేటీ నీరాజ్‌లు బుడతడి ఇంటికి వెళ్లి అతడిని వారితో ఆడిపించుకోవాలని తొట్టిగ్యాంగ్‌లోని చిన్నారులకు సలహా ఇచ్చి నచ్చజెప్పారు. పోలీసులే చిన్నారుల మధ్య సయోధ్య కుదుర్చి సమస్యకు పరిష్కారం చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment