
కొచ్చి : ఒక్క ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది అనే మాట వినే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఫోటోలు కూడా జీవితాలను మారుస్తాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచింది కేరళ అమ్మాయి హానాన్ హమీద్(19). కేవలం ఒక్క ఫోటో హానాన్ జీవితంలోని కష్టాలను దూరం చేయడమే కాక సినిమా అవకాశాన్ని కూడా తెచ్చి పెట్టింది.
వివరాల ప్రకారం.. తోడుపుజ్హాలోని అల్ అజహర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బీఎస్సీ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతున్న హానాన్‌కు చదువు అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించకపోవడంతో చేపలు అమ్మే అవతారం ఎత్తింది. అలా సంపాదించిన డబ్బుతోనే చదువు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో హానాన్ కాలేజీ యూనిఫామ్‌లో ఉండి చేపలు అమ్ముతుండగా తీసిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో హానాన్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
సోషల్ మీడియాలో హానాన్ ఫోటోలను చూసిన ప్రముఖ మలయాళి దర్శకుడు అరుణ్ గోపి తన తదుపరి చిత్రం ‘ఇరుపథియోన్నమ్ నొట్టాండు’లో హానాన్‌కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హానాన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు మాత్రం హానాన్ ఇప్పటికే మోహన్‌లాల్ చిత్రంలో నటిస్తుందని, కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్శించారు. దాంతో హానాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన కష్టాల గురించి చెప్పడంతో ఇంతకు ముందు ఆమెను విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.
హనన్ నేపధ్యం...
త్రిసూర్ మదవానాలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు హనన్. ప్రతిరోజు ఉదయం 3 గంటలకే తన రోజు ప్రారంభమవుతుంది అంటున్నారు హనన్. ‘రోజు ఉదయం మూడు గంటలకు లేచి, ఒక గంట చదువుకుంటాను. అనంతరం నా సైకిల్ మీద దగ్గరలోని చేపల మార్కెట్‌కు వెళ్తాను. అక్కడ చేపలు కొని, వాటిని కడిగించి, కట్ చేయించి తీసుకువస్తాను. తర్వాత ఇంటికి వచ్చి, ఇక్కడి నుంచి 60 కిమీ దూరాన ఉన్న కాలేజికి వెళ్తాను. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఉదయం తెచ్చిన చేపలను పాలరివట్టం-తామ్మనాం జంక్షన్ వద్ద అమ్ముతాను’ అని తెలిపారు.
అంతేకాక సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న కామెంట్ల గురించి స్పందిస్తూ ‘నేను నా ఏడో తరగతి నుంచి ఇలాంటి కష్టాలు అనుభవిస్తునాన్ను. ఆ రోజు నుంచి నేటి వరకూ నేను ఏదో ఒక పని చేసి నన్ను నేను పోషించుకుంటున్నాను. ఇంతవరకూ ఎవరి దగ్గర చేయి చాచలేదు. కానీ జనాలు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నన్ను విమర్శిస్తున్నారు. నన్ను అబద్దాల కోరు అంటున్నారు. ఇప్పటి వరకూ ఎన్నో పనులు చేశాను. వాటిల్లో చేపలు అమ్మడం కూడా ఒకటి’ అని తెలిపారు.
పత్రికల్లో హానాన్ గురించి చదివిన తర్వాత ఇంతకు ముందు ఆమెను తిట్టిన వారే ఇప్పుడు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వీరిలో కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నిథాల కూడా ఉన్నారు. ఈ విషయం గురించి ఆయన ‘పేపర్‌లో హనన్ గురించి చదివినప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. కష్టాలకు కృంగి పోకుండా జీవితాన్ని నెట్టుకొస్తోంది. బతకడం కోసం తీవ్రంగా కష్ట పడుతుంది. చాలా మందికి తాను ఆదర్శం. తన పట్టుదలకు నా సాల్యుట్’ అంటూ మెచ్చుకున్నారు.
హానాన్ గురించి తెలిసిన తర్వాత ప్రస్తుతం ఆమె చదువుతున్నా కాలేజీ యాజమాన్యం ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇక మీదట ఆమె చదువుకయ్యే ఖర్చును భరించడమే కాకా ఆమెకు ఉచితంగా వసతి సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment