
చెన్నై: దీపావళి స్ఫూర్తిని వెల్లడించేందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన ట్విటర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. గుజరాతీ జానపద బాణికి లయబద్ధంగా వృద్ధ మహిళ నృత్యం చేస్తున్న ఈ వీడియో చూడగానే ఆకట్టుకుంది. ఈ వృద్ధురాలు మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘97 ఏళ్ల వయసులోనూ దీపావళి స్ఫూర్తిని నింపుకుని తన సొంత గృహంలో దివాళి వేడుక చేసుకుంటున్న ఈమె ఎవరో కాదు ప్రధాని మోదీ మాతృమూర్తి’ అని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని సవరించుకున్నారు.
వీడియోలో కనిపించిన వృద్ధురాలు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కాదని తెలిపారు. ‘వీడియోలో ఉన్న వృద్ధురాలిని గుర్తించడంలో పొరపాటు జరిగింది. కానీ అమ్మ ఉత్సాహానికి సెల్యూట్ చేస్తున్నాను. నేను కనుక 96 ఏళ్లు బతికితే ఆవిడలా ఉండాలని కోరుకుంటాన’ని మరో ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోకు 13 వేల మంది పైగా లైక్ కొట్టగా, 4100 మంది రీట్వీట్ చేయడం విశేషం. దాదాపు వెయ్యి మంది కామెంట్లు పెట్టారు.
కిరణ్ బేడి షేర్ చేసిన వీడియో ఇదే