కేటీఆర్ డైనమిక్ లీడర్: కల్‌రాజ్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్ మిశ్రా ప్రశంసించారు. తెలంగాణలో ఖాయిలా పడుతున్న యూనిట్లను పునరుద్ధరించేందుకు, సంక్షోభంలో చిక్కుకుం టున్న యూనిట్లను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని కొనియాడారు. తెలంగాణలో ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి కేటీఆర్ వివరించిన అనంతరం కల్‌రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ డైనమిక్ లీడర్. చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఆయా పరిశ్రమలు నడుపుతున్న వారు పడుతున్న ఇక్కట్ల గురించి వివరించారు.
వారి కష్టాలు తీర్చడం తప్పనిసరి. చిన్న పరిశ్రమలు నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏలు)గా మారకుండా చూడాలి. ఈ అంశంపై కేటీఆర్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌లు పెట్టాలని సూచించారు. సిక్ యూనిట్ల పునరుద్ధరణకు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఆలోచిస్తాం’’ అని మిశ్రా పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా సదస్సులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లోనూ ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని కేటీఆర్‌కు సూచించినట్లు చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల సమస్యలపై కల్‌రాజ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు’’ అని వివరించారు.