
సాక్షి, న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత డికె శివకుమార్‌ను జనతాదళ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరి సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలు, వ్యక్తిగత స్నేహాలు వేరని అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత భేటీ అని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ.. తాను లొంగబోయేది లేదని, తాను ఎలాంటి తప్పూ చేయనపుడు ఎందుకు తల వంచాలని డీకే శివకుమార్ తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. డీకే శివకుమార్ మానసికంగా దృఢంగా ఉన్నారని, రాజకీయ కక్ష సాధింపులపై తాము పోరాడతామని కుమారస్వామి స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ 600 కోట్ల మనీ లాండరింగ్ కేసులో గత రెండు నెలలుగా సీబీఐ, ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణ అనంతరం తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment