
డీకే శివకుమార్
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్దం కాగా, ఇరుపార్టీ నేతల మధ్య పదవుల విషయంలో విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. అందరూ సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్-జేడీఎస్ నేతలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్ కీలకనేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. మా కూటమి అధికారంలోకి వస్తున్నందుకు నేతలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే సీఎం పదవిని తాను ఆశించలేదన్నారు. సీఎం పదవికి పోటీదారుడినని తానెప్పుడూ చెప్పలేదని వెల్లడించారు. నేటి కార్యక్రమం అంతా సవ్యంగా జరుగుతుందని శివకుమార్ ఆకాంక్షించారు.
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో బెంగళూరుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పలు పార్టీల కీలక నేతలు విచ్చేస్తున్నారు. ఇదివరకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, తదితర కీలక నేతలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు. మరికొందరు నేతలు అక్కడికి చేరుకుంటుండటంతో బెంగళూరులో సందడి వాతావరణం కనిపిస్తోంది. కాగా బుధవారం సాయంత్రం 4:30 గంటలకు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
సీతారాం ఏచూరి, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ, కన్నడ ప్రజల సంక్షేమం కోసం లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామని డీకే శివకుమార్ ఇటీవల పేర్కొన్నారు. అధిష్టానం కోసం చేదును మింగాల్సి వస్తోందని, అయినా వ్యక్తిగత అభిప్రాయాల కన్నా సమిష్టి నిర్ణయాలకే ఎక్కువ విలువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment