ఆగ్రా: వంద రూపాయల కూలి కోసం ఓ కార్మికుడిని హత్య చేసిన ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జై కిషన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానిక దేవాలయంలో చేసిన పనికిగాను తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగిన పప్పుపై జై కిషన్ ఆవేశంతో దాడికి దిగాడు. నేలమీద పడేసి పిడిగుద్దులు కురిపించడంతో పప్పు అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు.
దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, వందలాదిమంది దళితులు మేజర్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. నిందితుడి తాతపై దాడిచేశారు. పరిస్థతి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. తీవ్రంగా గాయపడిన రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్ ఉపాధ్యాయను స్థానిక సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని సీనియర్ పోలీస్ అధికారి రాజేష్ డి. మోదక్ తెలిపారు. అయితే జై క్రిషన్ పరారీలో ఉన్నాడనీ... అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.