
ఇప్పటికే మేం గెలిచేశాం: లాలు
బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఇప్పటికే గెలిచిపోయిందని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు. మహిళలు, వృద్ధులు, యువతీయువకులు అందరూ తమకే ఓటు వేశారని చెప్పారు.
పాట్నా: బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఇప్పటికే గెలిచిపోయిందని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు. మహిళలు, వృద్ధులు, యువతీయువకులు అందరూ తమకే ఓటు వేశారని చెప్పారు. రాష్ట్రంలో నలువైపులా మహాకూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పారు. గురువారం చివరి దశ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పలు వార్తా చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించాయి. ఇందులో మహాకూటమికి విజయం అని దాదాపు అన్ని చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
అలా ప్రకటించిన కాసేపట్లోనే లాలు ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసంకేతాన్ని చూపుతూ హాయిగా నవ్వుతూ విలేకరులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఓట్లు చీలిపోతాయని అందరూ అంటున్నారు కానీ ఒక్క ఓటు కూడా అటూఇటూ అవ్వలేదని అన్నారు. రైతులు, దళితులు, అందరినీ తాము దగ్గరికి తీసుకున్నామని, గిరిజనులకు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించామని, అది బాగా పనిచేసిందని చెప్పారు.
పరోక్షంగా ఆయన బీజేపీపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను కమ్యునలైజ్ చేసేందుకు ప్రయత్నించారని, గోమాంసం అంశాన్ని తెరమీదకు తెచ్చారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ బిహారీలను తిట్టారని, తనను సైతాన్ అన్నారని చెప్పారు. దీన్ని బిహార్ ప్రజలు, తాను చాలా సీరియస్ గా తీసుకుని పనిచేశామని చెప్పారు. బిహార్కు మోదీ ఇచ్చిన హామీలు ఏవీ కూడా పనిచేయలేదని ఆయన చెప్పారు.