
అక్రమ సంబంధముందని గొడ్డలితో నరికేశాడు
- ఒడిషాలో గిరిజనుడికి జీవితఖైదు
బరిపాడ (ఒడిషా): అరవై ఏళ్ల తన బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికేసి.. అతి కిరాతకంగా చంపిన ఓ వ్యక్తికి ఒడిషా కోర్టు జీవితఖైదు విధించింది. వితంతువైన తన కోడలితో బాబాయి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కారణంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 35 ఏళ్ల నాగకిషోర్ నాయక్ కు మయూర్‌బంజ్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మయూర్‌బంజ్ జిల్లా హాలాపూర్ గ్రామంలో నివసించే నాగకిషోర్ బాబాయి అయిన కునూ నాయక్(60)ను ఏప్రిల్ 27, 2011న గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి చంపాడు.
ఆ తర్వాత అతని చేతిని తీసుకొని వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వితంతువైన తన కోడలితో కునూ నాయక్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడని, అందుకే తాను అతడిని చంపేశానని కిషోర్ నాయక్ కోర్టులో నేరాన్ని ఒప్పుకొన్నాడు. ఈ కేసులో మొత్తం 20మంది సాక్షులను విచారించిన కోర్టు నాగకిషోర్‌ను దోషిగా ప్రకటిస్తూ జీవిత ఖైదు, పదివేల రూపాయల జరిమానా విధించింది.