
ఉద్దవ్ ఠాక్రే- ఫడ్నవీస్
బీజేపీ-శివసేన మధ్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ముంబై: బీజేపీ-శివసేన మధ్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మంత్రి మండలి విస్తరణకు మార్గం సుగమమైంది. బీజేపీ అధిష్టానం మంత్రి మండలి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కొత్త మంత్రుల్లో శివసేన కూడా ఉండేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మంత్రి మండలి విస్తరణ విషయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంతోపాటు శివసేనను భాగస్వామ్యం చేసుకోవాలనే విషయంపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగేందుకు శివసేన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఎన్సీపీ మద్దతును వ్యతిరేకిస్తూ శివసేనను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణలో శివసేనకు చెందిన మంత్రులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఉద్దవ్‌తో రైల్వే మంత్రి ప్రభు భేటీ
ఇటీవలి కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు శివసేన నుంచి బీజేపీలో చేరి రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ప్రభు శుక్రవారం రాత్రి ముంబైలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కలుసుకున్నారు. బీజేపీ-శివసేన మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికే ఆయన ఉద్దవ్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది.
**