
ఎల్‌వోసీ వద్ద హోరాహోరీ
సరిహద్దుల్లో ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆదివారం నలుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది.
ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం, ఇద్దరు జవాన్లూ బలి
రెండు వేర్వేరు సైనిక
ఆపరేషన్లలో ఎదురుకాల్పులు
సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ కాల్పులు
25 భారత ఔట్ పోస్టులు, 19 గ్రామాలపై బుల్లెట్ల వర్షం
శ్రీనగర్: సరిహద్దుల్లో ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆదివారం నలుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మరణించాడు. ఇక్కడి కలరూస్ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్క డికి చేరుకోగానే కాల్పులు మొదలయ్యాయి. కొద్ది గంటలపాటు ఇవి కొనసాగాయి. అనంతరం నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన జవాను నీరజ్ కుమార్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే జిల్లాలోని కేరన్ సెక్టార్‌లోనూ గత రాత్రి సైనిక దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రాహుల్ కుమార్ అనే సైనికుడు చనిపోయాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లోని జమ్మూ సెక్టార్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి 19 గ్రామాల పరిధిలోని 25 సైనిక ఔట్ పోస్టులను, ఆవాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శనివారం రాత్రి నుంచి నిరంతరం బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. మోర్టార్ బాంబులతో విరుచుకుపడుతోంది. బీఎస్‌ఎఫ్ బలగాలు కూడా ధీటుగా సమాధానమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాద స్థావరం గుట్టురట్టు
కిష్టవర్ జిల్లాలో ఓ మిలిటెంట్ స్థావరాన్ని సైన్యం గుర్తించింది. అక్కడి నుంచి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఓ రష్యన్ కార్బైన్ రైఫిల్ ఏకేఎస్-74యూ, ఏకే 56, మూడు రివాల్వర్లతో పాటు 73 గ్రెనేడ్లు, 3 వేలకుపైగా రౌండ్ల మందుగుండుతో పాటు పెద్దఎత్తున ఆయుధాలు లభించినట్లు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు తరచుగా కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు భారత సైన్యం తగిన విధంగా జవాబిస్తోందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో అన్నారు. చర్చలు భారత ప్రభుత్వంతో జరుపుతారా? లేక కాశ్మీర్ వేర్పాటువాదులతోనా? అనేది పాకిస్థానే తేల్చుకోవాలన్నారు. వేర్పాటువాదులతో చర్చలు జరిపి పాక్ తన అసలు నైజం బయటపెట్టడంతో.. చర్చలను రద్దు చేసుకోవడం ద్వారా తమవైపు నుంచి కూడా కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. బెర్హంపూర్‌లోని గ్రీన్ మిలటరీ స్టేషన్‌ను ఏర్పాటును ఆయన సమీక్షించారు. కాగా, పాక్ కాల్పుల ఉల్లంఘనతో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.