
సాక్షి, న్యూఢిల్లీ : సిమ్లాలో తీవ్ర నీటిఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న క్రమంలో గురువారం జాతీయ రహదారిపై కచి ఘటి ప్రాంతంలో భారీ నిరసనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైవేను దిగ్భందించారు. నీటి సంక్షోభానికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
తమకు కుళాయిల నుంచి నీళ్లు రావడం లేదని, పైప్‌లైన్‌ల ద్వారా నీటి సరఫరా చాలారోజుల నుంచి నిలిచిపోయిందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లు సైతం నివాస ప్రాంతాలకు రాకుండా, వీఐపీ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సిమ్లాలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్ధితి దయనీయంగా ఉంది.
తాగునీటి కోసం సిమ్లా పట్టణం సహా పరిసర ప్రాంతాల ప్రజలు వారం రోజులు పైగా వేచిచూస్తున్నారు. నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో వీఐపీ ప్రాంతాలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టూరిస్టులు సైతం కొద్దిరోజులు హిల్‌స్టేషన్‌కు దూరంగా ఉండాలని, నిర్మాణ కార్యకలాపాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment