భోపాల్: లాక్‌డౌన్ విధింపుతో వలస కార్మికుల జీవనం దుర్భరమైపోయింది. తినేందుకు తిండి లేక, సొంతూరికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ధైర్యం చేసి కాలినడకన తమ ఊళ్లకు బయల్దేరితే, మరికొందరు సైకిళ్లపై వెళ్తున్నారు. ఈక్రమంలో ప్రమాదాల బారినపడి కొందరు, వందల కిలోమీటర్ల ప్రయాణం కావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో పనిచేసే కొందరు వలస కార్మికులు రెండు రోజుల క్రితం సొంతూరు మధ్య ప్రదేశ్‌లోని మహరాజ్ గంజ్‌కు సైకిళ్లపై పయనమయ్యారు.
అయితే, 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యప్రదేశ్‌లోని బర్వానీకి చేరుకున్న అనంతరం అస్వస్థతకు గురైన తబరక్ అన్సారీ (50) అనే వ్యక్తి సైకిల్‌పై నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన శనివారం ఉదయం జరగింది. అన్సారీ తీవ్ర అలసటకు గురవడంతో, గుండెపోటు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అన్ని అంశాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా, బర్వానీ జిల్లాలో గత పది రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోదని స్థానికులు చెప్తున్నారు.
(చదవండి: పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం)
భివాండీలోని పవర్ లూమ్ యూనిట్‌లో పనిచేసే తమకు లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కరువైందని అన్సారీతోపాటు ప్రయాణం చేసిన మరో కార్మికుడు వాపోయాడు. తమ యూనిట్ యజమాని ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, తిండిలేక అల్లాడిపోయామని, అందుకనే ఏదేమైనా ఇంటికి వెళ్లాలని బయల్దేరామని చెప్పాడు. ఇక కరోనా విజృంభిస్తుండటంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది.
(చదవండి: 17దాకా లాక్‌డౌన్.. సడలింపులివే..!)
Comments
Please login to add a commentAdd a comment