వెల్లోకి దూసుకెళ్లి.... కాగితాలు చింపేశారు.
న్యూఢిల్లీ : విభజన బిల్లు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. ఉభయ సభల్లోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులతో తమ నిరసనలు తెలిపారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్ సభ వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సీమాంధ్ర ఎంపీలు వెల్లోకి దూసుకు వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఎంపీలు కూడా తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని, అయితే సభ అదుపులో లేనందున చర్చ చేపట్టలేకపోతున్నట్లు వెల్లడించారు. తీవ్ర గందరగోళం మధ్యే కొద్దిసేపు సమావేశాలను స్పీకర్ మీరాకుమార్ నడిపించినా .... అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు సభ ప్రారంభం కావటంతోనే సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఛైర్మన్ వెల్లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీలకు అన్నా డీఎంకే, డీఎంకే ఎంపీలు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్తో కలిసి కాగితాలు చించి ఛైర్మన్పై విసిరివేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను తొలుత పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా ప్రతిష్టంభన కొనసాగటంలో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం అయినా సీమాంధ్ర ఎంపీలు తమ పట్టు వీడకపోవటంతో సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.