పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ధరల పెరుగుదలపై లోక్ సభ దద్దరిల్లింది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ధరల పెరుగుదలపై లోక్ సభ దద్దరిల్లింది. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు మొదటి రోజే వాడీవాడీగా సాగుతున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ధరల పెరగుదలపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు పట్టుబట్టేసరికి సభలో గందరగోళం నెలకొంది. దాంతో సమావేశాలకు అంతరాయం ఏర్పడటంతో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
కాగా మొదటిరోజు లోక్‌సభ మొదలైన వెంటనే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద మృతులతో పాటు, చెన్నై భవన ప్రమాద ఘటన మృతులకు సంతాపం ప్రకటించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు రాజ్యసభలో సభ మొదలైన వెంటనే ఛైర్మన్ హమీద్ అన్సారీ.... సభ్యుల ప్రమాణ స్వీకార తీర్మానాన్ని వినిపించారు. అనంతరం పలువురు సభ్యులు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.