
పార్లమెంటు సమావేశాలు అదుర్స్!
చట్టసభలపై గౌరవం నానాటికీ తగ్గిపోతున్న ఈ రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నూటికి నూరుశాతం జరిగాయి! లోక్‌సభ నిర్దేశిత సమయం కంటే ఎక్కువగా.. 110.84% పనిచేయగా, రాజ్యసభ మాత్రం కొద్ది తక్కువగా 99.54% పనిచేసింది. ఈ లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో మొత్తం 15 బిల్లులను ప్రవేశపెట్టారు. వాటిలో లోక్‌సభ మొత్తం 15 బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ మాత్రం 14 బిల్లులను ఆమోదించింది. వాటిలో జీఎస్టీ అమలు కోసం తలపెట్టిన రాజ్యాంగ సవరణ కూడా ఒకటి ఉంది.
లోక్‌పాల్, లోకాయుక్త సవరణ బిల్లు లాంటి వాటిని ప్రవేశపెట్టినరోజే ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినా కూడా సభా సమయాన్ని మాత్రం వృథా చేయలేదు. వీళ్లు నిరసన తెలుపుతున్నా సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. వర్షాకాల సమావేశాలు మొత్తం 20 రోజుల పాటు ఉండగా వాటిలో లోక్‌సభ 11 రోజులు, రాజ్యసభ 14 రోజులు నిర్దేశిత సమయం కంటే తక్కువ సేపు పనిచేశాయి. మిగిలిన రోజుల్లో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పనిచేశాయి. దాంతో మొత్తం నూరుశాతం పనిచేసినట్లయింది. ద్రవ్యోల్బణం, దళితులపై దాడుల్లాంటి అంశాల గురించిన చర్చకు లోక్‌సభ 40 శాతం, రాజ్యసభ 52 శాతం సమయాన్ని కేటాయించాయి. కశ్మీర్ అంశం గురించి ఉభయ సభల్లో కలిపి 16 గంటల పాటు చర్చించారు.