రైళ్లలో ఎం–ఆధార్‌కు అనుమతి
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇకపై ఆధార్ కార్డును కచ్చితంగా వెంట తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ తరగతిలో ప్రయాణించే వారికి గుర్తింపు కార్డు కింద ‘ఎం–ఆధార్’ (మొబైల్ యాప్)ను అనుమతిస్తున్నట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. ఎం–ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసు కుని మొబైల్ నంబర్‌ను అనుసంధానిస్తే డిజిటల్ కార్డుగా ఉపయోగపడుతుంది. సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణికులు యాప్‌ను ఓపెన్‌చేసి పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే డిజిటల్ ఆధార్ కార్డు కనిపిస్తుంది.
ఎన్నారై పెళ్లిళ్లకు ఆధార్ తప్పనిసరి!
భారత యువతులను పెళ్లి చేసుకునే ఎన్నారైలకు ఇకపై ఆధార్ తప్పనిసరి కానుంది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కింద ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ సూచించింది. ఎన్నారైల పెళ్లిళ్ల వివాదాలు, మహిళల హక్కులను కాపాడటం, విదేశాల్లో వరకట్న వేధింపులు, గృహహింస బాధితులను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడు తుందని కమిటీ పేర్కొంది. ఎన్నారైల పెళ్లిళ్లకు ఆధార్ తప్పనిసరి చేయాలన్న కమిటీ తన నివేదికను విదేశీ వ్యవహారాల శాఖకు ఆగస్టు 30న సమర్పించింది. నిందితుల అప్పగింతకు పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో వరకట్న వేధింపులను కూడా చేర్చాలని సూచించింది.