
సాక్షి, న్యూఢిల్లీ: తుదిశ్వాస వరకు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి దివంగత కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కేరళకు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పీఎస్ కృష్ణన్ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన సంస్మరణ సభ శనివారం ఢిల్లీలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా కృష్ణన్ సమర్థవంతంగా పూర్తి చేశారన్నారు. ‘వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల ఉన్నతి కోసం కృష్ణన్ నిరంతరం కృషి చేశారు. రాజ్యాంగ పరంగా సంక్రమించే హక్కులు, ప్రజాకేంద్రిత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజా సంక్షేమం జరిగేలా చొరవ తీసుకున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ద్వారానే సమాజం ముందడుగు వేస్తుందని ఆయన బలంగా విశ్వసించేవారు. పీఎస్ కృష్ణన్ ఒక అసాధారణ వ్యక్తి, మేధావి. తను నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీపడే వారు కాదు’అని ఉపరాష్ట్రపతి అన్నారు. కార్యక్రమంలో పీఎస్ కృష్ణన్ సతీమణి శాంత, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ సహా సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.