
భోపాల్: ఓ బాలుడిని పోలీసులు చెప్పులతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అతడిని హింసిస్తున్న పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 రోజుల క్రితం జరిగిన ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వివరాలు.... రాష్ట్రంలోని దామో జిల్లాకు చెందిన బాలుడిని పోలీసు స్టేషనుకు తీసుకువచ్చారు. అనంతరం మఫ్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని ఇష్టారీతిన కొట్టారు. చెప్పులు, కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. నొప్పి తాళలేక.. తనను వదిలివేయమంటూ బాలుడు ఏడుడస్తున్నా పట్టించుకోకుండా దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. అతడు యూనిఫాంలో ఉన్న మరో పోలీసు అధికారి కాళ్లపై పడి క్షమాపణలు అడగడంతో కాస్త శాంతించారు.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. వీడియోలో ఉన్న కానిస్టేబుళ్లను మహేశ్ యాదవ్, మనీవ్ గాంధర్వ్‌గా గుర్తించామని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ ఘటనపై ట్విటర్‌లో స్పందించారు. ఈ మేరకు... ‘ దామో జిల్లాలో పోలీసులు అమాయకపు బాలుడిని కొడుతున్న వీడియో నా దృష్టికి వచ్చింది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాం. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదు. ఇది క్షమించరాని నేరం. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.