ఎవరైనా తప్పిపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎన్నాళ్లయినా దొరక్కపోతే, అంతకంటే పెద్ద వాళ్లు ఎవరున్నారా అని చూస్తాం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఏప్రిల్ నుంచి కనపడకుండా పోయిన పెద్దపులి 'జై'ని వెతికి తమకు అప్పగించడానికి సీబీఐని రంగంలోకి దించాలని కోరుతోంది. 250 కిలోల బరువున్న జై కోసం అటవీ శాఖాధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు ఎంతగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో దాన్ని వెతకడానికి సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రధానమంత్రికి త్వరలోనే లేఖ రాస్తానని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.
షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర పేరు మీద ఈ పులికి 'జై' అని పేరు పెట్టారు. గత మూడేళ్లుగా ఇది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. ఏడేళ్ల వయసున్న ఈ పెద్దపులి చివరిసారిగా ఉమ్రేద్ కర్హాండ్లా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏప్రిల్ 18న కనిపించిందని, ఆ తర్వాతి నుంచి దీని జాడ లేకుండా పోయిందని అంటున్నారు. అది క్షేమంగా ఉండాలంటూ స్థానికులు పూజలు కూడా చేయిస్తున్నారు.
జైని వెతికించడంలో సాయం చేయాల్సిందిగా ప్రధానమంత్రిని తాను కూడా కోరుతానని బీజేపీకి చెందిన ఎంపీ నానా పాటోల్ తెలిపారు. జైతో పాటు దాని తాత రాష్ట్రపతి, తండ్రి దెండు, సోదరుడు వీరు కూడా తప్పిపోయారని ఆయన చెప్పారు. మూడు నెలల క్రితం నుంచి జై మెడలో ఉన్న ఎలక్ట్రానిక్ కాలర్ నుంచి సిగ్నళ్లు రావడం ఆగిపోయింది. దాంతో దాని క్షేమంపై ఫారెస్టు రేంజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జై ఎక్కడుందన్న సమాచారం ఎవరైనా చెబితే రూ. 50వేల బహుమతి ఇస్తామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు జై 20 పిల్లలకు తండ్రి అయ్యిందని, వన్యప్రాణి ప్రేమికులను ఆకర్షిస్తూ స్థానికంగా పర్యాటక ఆదాయాన్ని పెంచిందని పర్యావరణవేత్త రోహిత్ కరూ చెప్పారు. దేశంలో మొత్తం 2,200 పులులున్నాయి. ప్రపంచంలోని పులుల జనాభాలో 70 శాతం ఇక్కడే ఉంది.