ముంబై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల సడలింపు సాధ్యం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల కరోనాను నియంత్రించగలిగామని.. అయితే వైరస్ గొలుసును మాత్రం పూర్తిగా విడగొట్టలేకపోయామన్నారు. మరోసారి మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడే అవకాశాలు లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అందుకే నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్‌జోన్లను అదే పరిధిలో కొనసాగేలా చేయడం సవాలుతో కూడుకున్న అంశమని ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. (మే 31 దాకా లాక్‌డౌన్: కొత్త నిబంధనలు ఇవే!)
కాగా లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల విషయంలో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక వలస కార్మికులు రాష్ట్రాన్ని వీడి స్వస్థలాలకు పయనమైన క్రమంలో.. వారి స్థానాన్ని భర్తీ చేయాలని స్థానికులను కోరారు. ‘‘మహారాష్ట్ర సోదర, సోదరీమణులారా. మీరు గ్రీన్‌జోన్‌కు చెందినవారైనట్లయితే.. దయచేసి బయటకు రండి. పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం ఎంతగానో ఉంది. మోదీజీ భాషలో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఆత్మనిర్భర్ కావాలి’’అని మహారాష్ట్రీయులకు విజ్ఞప్తి చేశారు. (ఛత్తీస్‌గడ్‌లో మరో మూడు నెలల పాటు..)
ఇదిలా ఉండగా రాజధాని ముంబైలో నిబంధనలు సడలించబోమని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. ‘‘లాక్‌డౌన్ 4.0లోనూ ముంబైలో పాత నిబంధనలే అమలవుతాయి. రెడ్‌జోన్ అయిన కారణంగా అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయి. అవసరం లేకున్నా బయటకు వచ్చే వారిపై చర్యలు తీసుకుంటాం’’అని ముంబై పోలీసులు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు దాదాపు 35 వేల కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 20 వేల మంది వైరస్ బారిన పడగా.. పుణె, థానే, నవీ ముంబై, ఔరంగాబాద్‌లో మహమ్మారి కోరలు చాస్తూ ప్రకంపనలు కొనసాగిస్తోంది. (ఓలా, ఉబెర్‌కు ఓకే.. ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!)
Comments
Please login to add a commentAdd a comment