
ఎంపీసీసీ అధ్యక్ష పదవికి మాణిక్‌రావ్ రాజీనామా
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆదివారం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ప్రతులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. మిత్రపక్షమైన ఎన్సీపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కనీసం 50 స్థానాలు కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడింది.
మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ ఠాక్రే సొంత నియోజకవర్గమైన యావత్మాల్‌లో ఘోరంగా ఓడిపోయారు. ఇటు పార్టీ, అటు కుమారుడు ఓడిపోవడంతో ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాత్రం దక్షిణ కరాడ్‌లో విజయ ఢంకా మోగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఇవ్వకపోవడంతో విలాస్‌కాకా ఉండాల్కర్ తిరుగుబాటు చేశారు. చవాన్‌కు వ్యతిరేకంగా బరిలోదిగి గట్టిపోటీనిచ్చారు. అయినప్పటికీ ఆయన్ని విజయం వరించలేకపోయింది.