
అసలు కథ.. ఆస్తి తగాదా
వీళ్లు మనకు తెలిసిన వాళ్లే.. 72 ఏళ్ల వయసులో ఐవీఎఫ్(కృత్రిమ గర్భధారణ) పద్ధతిలో తల్లి అవడం ద్వారా అమృత్‌సర్‌కు చెందిన దల్జిందర్ కౌర్, ఆమె భర్త మొహిందర్ సింగ్ గిల్(79) వార్తల్లోకి ఎక్కారు. అయితే.. మనకు తెలియని విషయమేమిటంటే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ. 5 కోట్ల ఆస్తి తగాదా వ్యవహారం దాగుందట. పిల్లల్లేరన్న వెలితిని పూడ్చుకోవడంతోపాటు తన తండ్రి ఆస్తి విషయంలో తోబుట్టువులతో 40 ఏళ్లుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలికేందుకు కూడా గిల్ ఈ వయసులో ఐవీఎఫ్ పద్ధతికి మొగ్గు చూపారట.
ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. రైతు కుటుంబానికి చెందిన గిల్‌కు నలుగురు తోబుట్టువులు. ‘పిల్లల్లేరనే కారణంతో నా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం చనిపోయారు. అయితే.. ఒకవేళ ఆస్తి ఇచ్చినా.. దాన్ని నా తదనంతరం చూసుకోవడానికి వారసులు లేరనే కారణంతో తోబుట్టువులు కూడా వాటా ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నాడు తండ్రితో నేడు తోబుట్టువులతో నాలుగు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నా.. ఈ మొత్తం వ్యవహారం మొదలైన సమయంలో నా వయసు 40 ఏళ్లు.
ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మాకు పిల్లలు కలగలేదు. 1970, 80ల్లో చాలా మంది వైద్యులను కలిశాం. అయితే.. అప్పట్లో ఈ రంగంలో వైద్యం ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఆశలు వదిలేసుకున్నాం. అయితే.. హరియాణాలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఇచ్చిన ప్రకటన చూసి.. ప్రయత్నించాం. రెండేళ్ల అనంతరం ఐవీఎఫ్ పద్ధతిలో మాకు బిడ్డ పుట్టాడు’ అని మొహిందర్ సింగ్ గిల్ చెప్పారు. తమ బిడ్డకు అర్మాన్(అభిలాష) అని పేరు పెట్టారు. అర్మాన్ పుట్టాకే తమ జీవితం పరిపూర్ణమైందని అన్నారు. ‘మేం చచ్చిపోతే.. మా బిడ్డ పరిస్థితి ఏంటని అందరూ అడుగుతున్నారు. కానీ మాకు భగవంతుడిపై పూర్తి నమ్మకముంది. అర్మాన్ పుట్టాక నాకు మరింత శక్తి వచ్చినట్లయింది’ అని గిల్ చెప్పారు.