
ముదిరిన బిహార్ సంక్షోభం
బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ–ఆర్జేడీల మధ్య విభేదాలు శనివారం మరోసారి బయటపడ్డాయి.
పట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ–ఆర్జేడీల మధ్య విభేదాలు శనివారం మరోసారి బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొనగా.. ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ గైర్హాజరయ్యారు. ఇక వేదికపై ఆర్జేడీ మంత్రి పక్కనున్న తన సీటును సీఎం నితీశ్ కుమార్ మార్పించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఏక్షణమైనా ఆర్జేడీతో జేడీయూ తెగదెంపులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఆర్జేడీ నేత, కార్మిక మంత్రి విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. తేజస్వీ ఎందుకు రాలేదో తనకు తెలియదని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వీ యాదవ్.. రాజీనామాకు నిరాకరించిన మరుసటి రోజే ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభంలో ఆర్జేడీ మంత్రి విజయ్ ప్రకాశ్ పక్కనే సీఎం నితీశ్ కుమార్ కూర్చున్నారు. కొద్దిసేపటి అనంతరం జేడీయూ మంత్రి పక్కకు తన సీటును సీఎం మార్పించుకున్నారు. అయితే వేదికపై ఏర్పాటు చేసిన టీవీ స్పష్టంగా కన్పించేందుకే నితీశ్ సీటు మార్పించుకున్నారని జై కుమార్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ శనివారం భేటీ అయ్యారు.