పరీక్షలపై మలాలా బెంగ! | Malala angst on the exam! | Sakshi
Sakshi News home page

పరీక్షలపై మలాలా బెంగ!

Published Mon, Oct 13 2014 1:44 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

పరీక్షలపై మలాలా బెంగ! - Sakshi

పరీక్షలపై మలాలా బెంగ!

లండన్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌కు ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుంది. రాబోయే పాఠశాల పరీక్షల గురించే ఆమె బెంగంతా. నోబెల్ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరగనున్న స్కూలు పరీక్షల గురించే ఆమె ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు ఆమె పేర్కొంది. రెండేళ్లక్రితం తాలిబాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఈ పాకిస్థాన్ బాలిక మరణాన్ని జయించి ఉద్యమబాటలో కొనసాగుతూ.. బాలికల విద్యాహక్కు కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. నోబెల్ బహుమతి వచ్చిన రోజు సాయంత్రం 17 ఏళ్ల మలాలా బర్మింగ్‌హామ్‌లో తన కుటుంబంతో కలసి పాకిస్థానీ టెలివిజన్ చూస్తూ గడిపింది. తనకు జలుబు చేసిందని, ఆరోగ్యం ఏమంత బాగాలేదని ఆమె ‘ది సండే టైమ్స్’తో పేర్కొంది.

‘‘నోబెల్ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నా. నిజంగా ఇది గొప్ప గౌరవం. ప్రజలు చూపించిన ఆప్యాయతే కాల్పుల నుంచి కోలుకోవడానికి, మరింత దృఢంగా తయారు కావడానికి తోడ్పడింది. అందుకే సమాజానికి నా వంతు సేవ చేయాలని భావిస్తున్నా’’ అని ఆమె పేర్కొంది. తనకు నోబెల్ బహుమతి రాబోతున్న విషయంపై మలాలాకు అవగాహ నుంది. అయితే ఈ విషయాన్ని తన టీచర్ ద్వారానే ఆమె తెలుసుకుంది. అవార్డు వచ్చినరోజు ఉదయం పదిగంటలకు మలాలాకు కెమిస్ట్రీ క్లాస్ ఉంది. ‘‘నా వద్ద మొబైల్ లేదు. దీంతో నోబెల్‌కు సంబంధించిన వార్త రాగానే.. తాను వస్తానని టీచర్ తెలిపారు. పదింబావు అయింది. అయినా టీచర్ రాలేదు. దీంతో నాకు నోబెల్ రాలేదని భావించా. అయితే కొద్దినిమిషాల తర్వాత టీచర్ వచ్చి విషయం చెప్పారు’’ అని ఆమె తెలిపింది. తనకు అవార్డు వచ్చే విషయంలో తన టీచర్లే ఎక్కువ ఆసక్తి చూపారని, అవార్డు వచ్చినట్టు ప్రకటించాక తనకంటే వారే ఎక్కువ ఆనందపడ్డారని వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement