ఇస్లామాబాద్ : నోబెల్ శాంతి బహుమతి అందుకునే సామర్ధ్యం తనకు లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.ఇమ్రాన్ ప్రతిష్టాత్మక శాంతి బహుమతి స్వీకరించేందుకు అర్హుడని పాక్ పార్లమెంట్ తీర్మానించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించి ఉపఖండంలో శాంతి, మానవవికాసానికి బాటలుపరిచే వ్యక్తే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అర్హుడని సోమవారం ఉదయం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా ఇమ్రాన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని పాక్ పార్లమెంట్‌లో సమాచార మంత్రి ఫవాద్ చౌధురి ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తమ చెరలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను జెనీవా తీర్మానాలకు అనుగుణంగా శాంతి సందేశం పంపే క్రమంలో భారత్‌కు సురక్షితంగా అప్పగించామని ఇమ్రాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (అభినందన్ విడుదల.. ఇమ్రాన్ ఎక్కడ?)
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ గత వారం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడం, పాక్ ప్రతిదాడులతో చెలరేగడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో దిగివచ్చిన పాక్ తమ నిర్బంధంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment