రైళ్లలోని టాయిలెట్లు.. వాటి పేరెత్తితే చాలు.. మొహం చిట్లించే వారెందరో.. తలుపు తీస్తే.. కంపు తప్ప ఇంకేమీ ఉండదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక ట్రాకుల మీద పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీటన్నిటికీ చెక్ పెట్టేలా.. స్వచ్ఛ భారత్ ప్రాజెక్టులో భాగంగా తెచ్చినదే.. బయో టాయిలెట్లు.. ఇందుకోసం నాలుగేళ్లలో సుమారు రూ.1,305 కోట్లను భారత రైల్వే ఖర్చు చేసింది. అయితే.. సెప్టిక్ ట్యాంక్‌లతో పోలిస్తే.. ఇవి ఏమాత్రం మెరుగైనవి కావని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రైలు బోగీల్లోని బయో టాయిలెట్లపై అధ్యయనం చేసి మరీ.. ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఐఐటీ మద్రాస్ నిర్వహించిన ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఇటీవలే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశారు.
బయో టాయిలెట్స్ అంటే..
ప్రధానమైన ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో సుమారు 93,537 బయో–డైజెస్టర్స్(బయో టాయిలెట్స్)ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. బయో టాయిలెట్లలో టాయిలెట్ సీటు కింది భాగంలో చిన్న స్థాయి మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఉంటుంది. ట్యాంకు ఆకారంలో ఉండే ఈ బయో డైజెస్టర్లలో మనుషుల మల వ్యర్థాలను తినే బ్యాక్టీరియాను ఉంచుతారు. మలవ్యర్థాలను ఈ బ్యాక్టీరియా స్వీకరించడమే కాకుండా నీరు వాసన రాకుండా శుభ్రం చేస్తుంది. ఈ నీటిని బయటకు వదిలేసినా(అంటే రైలు వెళ్తున్నప్పుడు పట్టాలపై) ఏ విధమైన సమస్యలు రావు. వాస్తవంలో ఈ ప్రక్రియ సక్సెస్ కావట్లేదని శానిటేషన్ నిఫుణులతో పాటు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కమిటీలు కూడా చెపుతున్నాయి.
శుద్ధి కాకుండానే బయటకు..
బయో టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, అందువల్ల బయటకు వదులుతున్న వ్యర్థాలు శుభ్రం కాకుండా ఉండిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బయో డైజెస్టర్ల నుంచి తాము సేకరించిన మల వ్యర్థాలు ఎటువంటి శుద్ధికీ నోచుకోలేదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ లిజీ ఫిలిప్ స్పష్టం చేశారు. సెప్టిక్ ట్యాంకుల్లో మాదిరిగానే మల వ్యర్థాలు నీటిలో కలసిపోయి బయటకు విడుదల అవుతున్నాయని చెప్పారు. బయో టాయిలెట్ల వినియోగంపై విమర్శలు వస్తున్నప్పటికీ 2018 డిసెంబర్ నాటికి 1,20,000 బోగీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో), భారత రైల్వే శాఖ సిద్ధమవుతున్నాయి. దీనికి రూ.1,200 కోట్లు వ్యయం కానున్నట్టు ఇటీవల సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ చెప్పింది.
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment