డీఏ నిలుపుదలకు ఇది సమయం కాదు | Manmohan Singh Comments on Center freezing Dearness Allowance | Sakshi
Sakshi News home page

డీఏ నిలుపుదలకు ఇది సమయం కాదు : మాజీ ప్ర‌ధాని

Published Sat, Apr 25 2020 10:16 AM | Last Updated on Sat, Apr 25 2020 10:32 AM

Manmohan Singh Comments on Center freezing Dearness Allowance - Sakshi

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేడయంపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ర‌క్ష‌ణ ద‌ళాల‌పై భారం వేయ‌డం త‌గ‌ద‌న్నారు.

కోవిడ్‌–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్‌–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్‌ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది.

అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది.

ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్‌పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement