
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం రోజున ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. (చదవండి : మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం)
కాగా, ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో మన్మోహన్‌కు జ్వరం కూడా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు.. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. మొదట వైద్యులు ఆయన్ని కార్డియో థొరాసిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం కార్డియో–న్యూరో టవర్‌లోని ప్రైవేట్ వార్డుకు తరలించారు. కాగా, 1990లో ఆయనకు తొలిసారిగా బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2003లో ఆయనకు స్టంట్ వేశారు. 2009లో మరోసారి ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది.