న్యూఢిల్లీ : బ్యాంకుల దీనస్థితికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌లే బాధ్యత వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. సమస్యకు పరిష్కారాలను అన్వేషించే బదులు ప్రభుత్వం ప్రత్యర్ధులపై నిందను మోపడంలో నిమగ్నమైందని మన్మోహన్ అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఇప్పుడే చూశా..ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఎవరైనా అనుకుంటే దాని అవలక్షణాలు, సమస్యకు మూలాలను సరిగ్గా పసిగట్టి చికిత్స చేయాలి..ప్రత్యర్ధులపై నింద మోపి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంద’ని మన్మోహన్ దుయ్యబట్టారు.
ప్రభుత్వ తీరు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతమాత్రం ఉపకరించదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా, రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ప్రస్తుత బ్యాంకుల దుస్థితికి బీజం పడిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారి హయాంలో కొందరి ఫోన్‌కాల్స్‌తోనే బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేశాయని ఆమె ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment