జాతిపిత మహాత్మా గాంధీ 144వ జయంతి సందర్భంగా బుధవారం జాతి యావత్తూ ఘన నివాళులర్పించింది. రాజ్‌ఘాట్‌లోని బాపూజీ సమాధిపై ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 144వ జయంతి సందర్భంగా బుధవారం జాతి యావత్తూ ఘన నివాళులర్పించింది. రాజ్‌ఘాట్‌లోని బాపూజీ సమాధిపై ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తదితరులు జాతిపితకు నివాళులర్పించారు. తొలుత సోనియాగాంధీ రాజ్‌ఘాట్‌కు వచ్చి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభ, ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా వారితో పాటు వచ్చి బాపూజీకి నివాళులర్పించారు. కేంద్ర మహిళా,శిశు సంక్షేమ మంత్రి కృష్ణ తీరథ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్ తదితరులు కూడా జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి 109వ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. జై జవాన్ జై కిసాన్ అని నినదించిన శాస్త్రికి విజయ్ ఘాట్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రితోపాటు సోనియా, అద్వానీ తదితరులు నివాళులర్పించారు. శాస్త్రి పుత్రులు అనిల్ శాస్త్రి, సునీల్ శాస్త్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.