మోదీపై మరోసారి మమత నిప్పులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిది మన్ కీ బాత్ కాదని, అది మోదీకి బాత్ అని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆదివారం నాటి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు 50 రోజులు ఉంటాయని తాను ముందే చెప్పానని, దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని మరోసారి అన్నారు. నల్ల డబ్బున్న వారే తన నిర్ణయంతో కంగారు పడుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మమత ట్విట్టర్ లో స్పందించారు. ముందు నుంచే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె మోదీపై నిప్పులు చెరిగారు. ’ఉపశమన చర్యలు చేపట్టాల్సిందిపోయి కక్ష పూరిత చర్యలకు ప్రచారానికి, వ్యాపారానికి అనుకూలంగా మీరు చేస్తున్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని నిర్మూలించారు. మాకు అభివృద్ధి కావాలి.. సాంకేతిక పరిజ్ఞానం కావాలి. కానీ, అది ఒక్క వర్గానికి మాత్రమే దక్కేలా కాదు. మిమ్మల్ని, మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మేం నమ్మం.. అవి ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే పనికొస్తాయి. ఈ దేశంలోని మహిళలంతా మీకు తగిన బదులు ఇచ్చి తీరుతారు. వీళ్లంతా భరతమాత ముద్దు బిడ్డలు’ అంటూ ఆమె ట్వీట్ల వర్షం కురిపించారు.