మనోజ్‌కుమార్‌కు ‘ఫాల్కే’
* దేశభక్తి సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన హీరో
*పురస్కారంతో పాటు 10 లక్షల నగదు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్(78)కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించారు. ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘ఉపకార్’, ‘క్రాంతి’ లాంటి విజయవంతమైన దేశభక్తిని ప్రబోధించే సినిమాల్లో కథానాయకుడిగా మనోజ్ నటించారు. ‘మేరా దేశ్ కి ధర్తీ..’ ‘ఏక్ ప్యార్ క నగ్మా హై తదితర ఎవర్‌గ్రీన్ పాటల్లోనూ ఆయన కనిపిస్తారు. ఫాల్కే అవార్డ్ కింద స్వర్ణ కమలం, 10 లక్షల నగదును ఆయనకు అందించనున్నారు.
లతామంగేష్కర్, ఆశాభోంస్లే, కవి, రచయిత సలీమ్ ఖాన్, గాయకులు నితిన్ ముకేశ్, అనూప్ జలోటాలతో ప్రభుత్వం నియమించిన ఎంపిక కమిటీ మనోజ్ కుమార్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. మనోజ్ కుమార్ హీరోగా నటించిన వాటిలో హరియాలీ ఔర్ రాస్తా, హనీమూన్, వో కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, సాజన్, దో బదన్, పథ్థర్ కే సనమ్, రోటీ కపడా ఔర్ మకాన్.. తదితర విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న అబోతాబాద్‌లో 1937, జూలై 24న మనోజ్ జన్మించారు.
తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు హరికృష్ణగిరి గోస్వామి. మనోజ్‌కు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఢిల్లీకి తరలి వచ్చింది. డిగ్రీ అనంతరం మనోజ్ సినీరంగ ప్రవేశం చేశారు. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం ప్రేరణతో మనోజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉపకార్’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది.
సంతోషంగా ఉంది: మనోజ్‌కుమార్
పురస్కారాన్ని తనకు ప్రకటించడం పట్ల మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. స్నేహితులు ఫోన్ చేసి చెబితే తొలుత నమ్మలేదని వ్యాఖ్యానించారు.