జైపూర్ : రాజస్ధాన్‌లో ఓ దళిత పోలీస్ పెళ్లి ఊరేగింపుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుగార్ గ్రామంలోకి శనివారం తన పెళ్లి ఊరేగింపు ప్రవేశించిన సమయంలో కొందరు రాజ్‌పుట్ వర్గీయులు తమపై దాడిచేశారని వరుడు సవాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయని బాధితుడు తెలిపారు.
కాగా, కులదురహంకారంతోనే ఈ దాడి జరిగిందని దళిత సంఘాలు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కాగా బాధితుడి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. గతంలోనూ దళితుల పెళ్లి ఊరేగింపులు తమ వీధుల నుంచి వెళ్లరాదంటూ పలు చోట్ల దాడులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment