
వారసుడికి పార్టీలో కీలక పదవి కట్టబెట్టిన మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిత్యం మాట్లాడే బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీలో కీలక పదవులను తన సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌లకు కట్టబెట్టారు. మాయావతి తన సోదరడు కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు.
లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. లోక్‌సభలో పార్టీ నేతగా అమ్రోహ ఎంపీ దానిష్ అలీని నియమించారు. కాగా మాయావతి తన వారసుడిగా సోదరుడి కుమారుడు ఆకాష్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. పలు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటుండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
కాగా మాయావతి 2007-2014ల మధ్య యూపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో ఆనంద్ కుమార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయనే విమర్శల నేపథ్యంలో కొంతకాలం కుమార్‌ను పక్కనపెట్టిన మాయావతి తిరిగి ఆయన కుమారుడు, తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రోత్సహిస్తుండటం గమనార్హం.