దిబ్రగఢ్లోని అసోం మెడికల్ కాలేజి హాస్పిటల్ ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న ఓ పీజీ విద్యార్థిని వార్డు బాయ్ హత్య చేశాడు.
దిబ్రగడ్: దిబ్రగఢ్లోని అసోం మెడికల్ కాలేజి హాస్పిటల్ ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న ఓ పీజీ విద్యార్థిని వార్డు బాయ్ హత్య చేశాడు. ఆపరేషన్ చేసే కత్తితో సరితా తస్నివాల్ అనే డాక్డర్ మెడ ఎడమ వైపున పొడిచి చంపాడు. ఐసీయూలోని డాక్టర్ల విశ్రాంతి గదిలో బెడ్పై సరిత మృతదేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. నిందితుడు అత్యాచారానికి ప్రయత్నించి ఉండొచ్చని, ఈ క్రమంలో ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సరితా తస్నివాల్ శుక్రవారం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు డ్యూటీలో ఉన్నారు. 5:30 గంటల తర్వాత విశ్రాంతి గదికి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ సమయంలోనే ఆమెపై దాడి జరిగింది. అసోం మెడికల్ కాలేజి హాస్పిటల్ నుంచే సరిత ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతంరం పీజీలో చేరారు. సహ వైద్యుడితో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలోనే సరితకు వివాహం జరగాల్సిఉంది. ఈలోగా దారుణం జరిగింది. వైద్యులకు, ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు.