బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, దారుణ హత్య కేసుకు మతం రంగు పులుముతున్నారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి విపక్షాలపై మండిపడ్డారు. గతంలో దళితులు, మైనారిటీలపై దాడులంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ తాజాగా మహిళల అంశాలపై మొసలికన్నీరు కారుస్తోందన్నారు. కథువా ఘటనలో నిందితులకు అనుకూలంగా మాట్లాడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కొందరు తప్పుదారి పట్టించారని, వారు అలా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. ఈ ఘటనను బీజేపీ ఇప్పటికే ఖండించిందని, నిందితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడతాయని చెప్పారు.
మరోవైపు ఉన్నావ్ ఘటనను లేఖి ప్రస్తావించారు. ఈ ఘటన గత ఏడాది జరిగిందని, అప్పట్లో బాధితురాలు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పేరును మేజిస్ర్టేట్ ఎదుట ప్రస్తావించలేదని చెప్పారు. ఆ తర్వాతే ఆమె సెంగార్‌పై ఫిర్యాదు చేశారని, ప్రస్తుతం ఆయనను సీబీఐ ప్రశ్నిస్తోందని, బాధితురాలి తండ్రిని వేధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్‌ను అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. లైంగిక దాడికి లోనయ్యే వారంతా బాధితులేనని..వీటికి మతం రంగు పులమవద్దని కోరారు. అస్సాంలో ఐదో తరగతి విద్యార్థినిపై జాకీర్ హుస్సేన్ అనే యువకుడితో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసి, సజీవంగా హతమార్చారని దీనిపై విపక్షాలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment