ప్రయాణీకులకు ఆ బస్ కండడక్టర్ అంటే వల్లమాలిన అభిమానం... ప్రతిరోజూ తన బస్ లో ప్రయాణించే వారికోసం అతడు ప్రత్యేక సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నాడు. ప్రజాసేవే పరమార్థంగా భావించి... తరచుగా వచ్చే వారికోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించాడు. ఆధునిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని అందరికీ ఆప్తుడయ్యాడు. కేరళ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పని చేస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
39 ఏళ్ళ షిజు... తిరువనంతపురం లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. కెయు ఆర్టీసీ... నెయ్యట్కింకర నుంచి టెక్నో పార్క్ వరకు ప్రతిరోజూ నడిపే ఓల్వో బస్ లో ప్రత్యేక సేవలు అందిస్తూ... రోజువారీ ప్రయాణీకులకు తల్లో నాలుకయ్యాడు. ఇటీవల ప్రతివారికీ అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమం వాట్సాప్ ను వినియోగించి.. రెగ్యులర్ పాసింజర్ల గ్రూప్ ను క్రియేట్ చేశాడు. గ్రూప్ లో తమ బస్ ప్రయాణం మొదలైనప్పటినుంచీ చివరి స్టేజ్ దాకా అప్ డేట్స్ అందిస్తుంటాడు.
షిజు బస్ లో సుమారు ఏభైమంది రెగ్యులర్ ప్రయాణీకులున్నారు. వీరంతా అతడి సేవలను అమితంగా కొనియాడుతున్నారు. షిజు ప్రత్యేక సౌకర్యం అందించడం తమకెంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. వాట్సాప్ అప్ డేట్స్ ఇవ్వడం వల్ల తాము ఇంటినుంచీ మరీ ముందుగా బయల్దేరాల్సిన అవసరం లేదని... దీంతో ఎంతో సమయం కలసి వస్తోందని అంటున్నారు. అంతేకాదు అతడు ఏసీని అదుపులో ఉంచడం, టికెట్స్ అందించడం, ప్రయాణీకులకు ప్రశాంతతను కలిగించే మ్యూజిక్ ను ప్లే చేయడం వంటి మరెన్నో ప్రత్యేక విషయాలను పాటిస్తాడని ఓ ప్రయాణీకుడు రాహుల్ చెప్తున్నాడు. వాట్సాప్ గ్రూప్ లో అప్ డేట్స్ ను కూడ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ షిజు అందరి మన్ననలూ పొందుతున్నాడు.
ప్రజాసేవే ఆ బస్ కండక్టర్ పరమార్థం..!
Published Fri, Feb 5 2016 10:02 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement