వేలమందిని ఆదుకుంటున్న ఫేస్ బుక్ పేజీ!
వేలమందిని ఆదుకుంటున్న ఫేస్ బుక్ పేజీ!
Published Mon, Jun 13 2016 7:01 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
కేరళః సామాజిక మాధ్యమాలతో చెడు అలవాట్లకు బానిసలౌతున్నవారు కోకొల్లలుగా కనిపిస్తున్న నేటి తరుణంలో.. ఆ బస్ డ్రైవర్ మాత్రం సద్వినియోగపరచుకున్నాడు. ప్రజాసేవే లక్ష్యంగా తాను స్వయంగా ఓ ఫేస్ బుక్ పేజీని సృష్టించి.. సోషల్ మీడియా పవర్ తో ప్రజల్లో సామాజిక మార్పు తెచ్చేందుకు కృషి చేశాడు. 'ఉయ్ హెల్ప్' పేరిట రూపొందించిన వేదిక ద్వారా పేదలకు సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టాడు.
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (కెఎస్ ఆర్టీసీ) లో కండక్టర్ గా పనిచేస్తున్న వినోద్.. ఆర్థికంగా వెనుకబడిన వారికి, పేదలకు సేవలు అందించాలనుకున్నాడు. 2011 లో ఉధృతంగా కొనసాగుతూ, ఎంతో ప్రజాదరణ పొందుతున్న సోషల్ మీడియా శక్తిని... తమ రాష్ట్ర ప్రజల్లో సామాజిక మార్పుకోసం వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా 'ఉయ్ హెల్ప్' పేరున ఫేస్ బుక్ పేజీని ప్రారంభించి, పేద ప్రజలకు సహాయం అందించేందుకు వేదికగా మార్చాడు. ఆ పేజీ వినోద్ వంటి సేవా తత్పరత కలిగిన ఎంతోమందిని ఆకట్టుకుంది. గ్రూప్ ద్వారా రక్తదానం కార్యక్రమం ప్రారంభించిన వినోద్ బృందం, రక్తదానం చేసేవారినుంచి సేకరించి అవసరమైన వారికి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బ్లడ్ డొనేషన్.. ఈ గ్రూప్.. ప్రధాన కార్యక్రమంగా మారిపోయింది. 'బ్లడ్ డోనర్స్ కేరళ' పేరున పేజీలో ప్రత్యేక గ్రూప్ ఏర్పడింది. కొందరు ఔత్సాహికులు ఆయా ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ కు సహకరిస్తున్నారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనివారికైనా రక్తం అవసరమైనప్పుడు తక్షణమే అందించేందుకు బృదంలోని సభ్యులు సహకరిస్తున్నారు. అంగమలై, అలువా, కోలన్ చ్చేరీ, ఎర్నాకుళం, ఎడప్పల్లీ, పెరంబవూర్ వంటి ప్రాంతాల్లోని గ్రూప్ సభ్యులను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తే, డోనర్లు వారికి రక్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ ద్వారా రక్తం అందించే సభ్యులు 10,000 మంది వరకూ ఉన్నారు. అంతేకాదు గ్రూప్ సభ్యుల ఇళ్ళలో జరిగే వేడుకల సందర్భంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల గ్రూప్ సభ్యుల్లోని ఓ వ్యక్తి తన పెళ్ళి వేడుకలో బంధువులతో రక్తదానం చేయించడంతోపాటు, తాను స్వయంగా రక్తాన్ని అందించాడు. గత సంవత్సర కాలంలో వినోద్ గ్రూప్ సుమారు 60 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రక్తం సేకరించడంతోపాటు, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా వేలకొద్దీ యూనిట్ల రక్తాన్ని సేకరించడంతోపాటు... అవసరమైనవారికి అందించేందుకు సహాయపడింది. రక్తదానం ఒక్కటే కాక పేద పిల్లలకు చదువు చెప్పించేందుకు, అనాధలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించేందుకు కూడ వేలకొద్దీ సభ్యులున్న ఈ గ్రూప్ సహకరిస్తోంది.
Advertisement
Advertisement