
సాక్షి,లక్నో: లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్‌పో-2020 కార్యక్రమానికి ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని తెలిపారు.(నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి)
డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment