సీబీఐ ఉత్తమ అధికారి లంచగొండిగా మారి..
న్యూఢిల్లీ: మంచి పనితీరుతో అవార్డు పొందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సీబీఐ ముంబై విభాగం డీఎస్పీగా నీరజ్ అగర్వాల్ పనిచేస్తున్నారు. మెరుగైన పనితీరు కనబరిచినందుకుగానూ నీరజ్ అగర్వాల్ 2016 సంవత్సరానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు. ఈయన స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రదీప్‌షాకు సంబంధించిన కేసును విచారిస్తున్నారు.
ఈ కేసు నుంచి తప్పించటానికిగాను అగర్వాల్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.35 లక్షలు ఇచ్చేందుకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై బాధితుడు సీబీఐని ఆశ్రయించారు. సీబీఐ సూచనల మేరకు బుధవారం మొదటి విడతగా రూ.4 లక్షలు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన తివారీ అనే వ్యక్తిపైనా కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.