
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని మెట్రో మేన్‌గా గుర్తింపు పొంది పదవీవిరమణ చేసిన ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఈ శ్రీధరన్ స్పష్టం చేశారు. మెట్రోలో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తే రవాణా వ్యవస్ధ కుప్పకూలి దివాలా తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో శ్రీధరన్ విజ్ఞప్తి చేశారు.
మహిళలకు ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపరాదని మోదీకి రాసిన లేఖలో ఆయన తేల్చిచెప్పారు. 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభించే సమయంలో ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇందుకు ఎవరికీ మినహాయింపు లేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సైతం 2002 డిసెంబర్‌లో షహ్‌దర నుంచి కశ్మీరీ గేట్ వరకూ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)లో కేవలం ఓ భాగస్వామి ఢిల్లీ మెట్రోలో ఓ వర్గానికి ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సంస్థను దివాలా తీయించలేరని శ్రీధరన్ తేల్చిచెప్పారు. ఢిల్లీమెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఇతర మెట్రోలూ ఇదే ఒరవడి అనుసరించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో తలెత్తే ఆదాయ నష్టాన్ని తాము పూడ్చుతామన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన పసలేని వాదనగా కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment