డోర్లు తెరుచుకునే మెట్రో రైలు రయ్...
సాక్షి, న్యూఢిల్లీ: మహా నగరాలకు మణిహారంగా అభివర్ణించే మెట్రో రైలు ప్రాజెక్టులను... ఆయా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ వ్యయంతో రూపొందిస్తుంటాయి.అదే సమయంలో ప్రయాణికులకు భద్రతపరమైన హామీని ఇవ్వాల్సిన అవసరం సిబ్బందిపై ఉంటుంది. సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తితే ఘోర ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీలో గత రాత్రి జరిగిన ఓ ఘటన చూద్దాం. కిక్కిరిసిన ప్రయాణికులతో సోమవారం రాత్రి నార్త్ ఢిల్లీ-గుర్గావ్‌ల మధ్య నడిచే యెల్లో లైన్ బుల్లెట్ ట్రైన్ రయ్ మంటూ దూసుకుపోతుంది. 10 గంటల ప్రాంతంలో చౌరీ బజార్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు డోర్లు మూతపడలేదు. కశ్మీరే గేట్ స్టేషన్ వెళ్లే దాకా డోర్ అలాగే తెరుచుకుని ఉంది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేశాడు.
దీంతో రైల్వే సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉన్నారో అంటూ విమర్శలు చెలరేగాయి. విషయం తమ దాకా రావటంతో ఢిల్లీ మెట్రో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహించిన ట్రెయిన్ ఆపరేటర్ ను సస్పెండ్ చేశారు. మూడేళ్ల క్రితం ఘితోర్నీ-అర్జంఘడ్ స్టేషన్ల మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే.