అక్కడ పరుగు.. ఇక్కడ పడక!
► మూడేళ్లుగా ప్రారంభంపై సర్కారు మీనమేషాలు ∙పలు మెట్రో నగరాల్లో 45–55 నెలల్లోనే పట్టాలెక్కిన రైళ్లు
అంతకంతకూ పెరుగుతున్న వాహనాలు... రద్దీగా మారుతున్న రోడ్లు... మెట్రో రైలు పరుగులతోనైనా ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం వస్తుందని ఆశిస్తున్న నగరవాసుల ఎదురుచూపులు ఎంతకీ ఫలించడం లేదు. బెంగళూరు, కోచి వంటి ఇతర నగరాల్లో తక్కువ సమయంలోనే మెట్రో రైళ్లు పట్టాలెక్కి కూత పెడుతుంటే... పనులు ప్రారంభించి 64 నెలలు గడిచినా రాజధానిలో మాత్రం అదిగో... ఇదిగో... అంటూ కాలయాపన తప్ప నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసలు ఎప్పుడు పూర్తవుతుందో అంతుపట్టక గ్రేటర్‌వాసులు సమాచార హక్కు చట్టం కింద అధికారులను నిలదీస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్: నగరంలో మొత్తం మూడు మెట్రో కారిడార్లకు గాను నాగోలు–మెట్టుగూడా (8 కి.మీ.), మియాపూర్–ఎస్‌ఆర్‌నగర్ (12 కి.మీ.) మార్గాల్లో 20 కి.మీ. మార్గం సిద్ధమైంది. అయినా పాలకులు మాత్రం ప్రారంభానికి పచ్చజెండా ఊపడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న అయినా రైళ్లు పరుగులు పెడతాయని ఆశించిన సిటిజనులకు నిరాశే మిగిలింది. తాజాగా కేరళలోని కొచ్చిలో కేవలం 45 నెలల్లోనే మెట్రో ప్రాజెక్టు పూర్తయి పట్టాలెక్కింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనూ పనులు ప్రారంభించిన 45–55 నెలల్లోనే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రేటర్‌లో ఐదేళ్లు పూర్తయినా పనులు ఇంకా సాగుతూనే ఉండంపై హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ అధికారులను పలువురు సిటిజన్లు స.హ.చట్టం కింద ప్రశ్నిస్తున్నారు. మెట్రో తొలిదశను ప్రారంభించే అంశం ప్రభుత్వ పరిధిలోనిదని.. తమ పరిధిలో లేదని అధికారులు బదులివ్వడం గమనార్హం.
అదిగో... ఇదిగో..!
మెట్రో ప్రారంభంపై 2014 నుంచి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గత మూడేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ ప్రారంభంపై ప్రకటనలు... ఊహాగానాలతో కాలక్షేపం చేస్తోంది. తొలుత నాగోల్ –మెట్టుగూడా మార్గంలో రైళ్లు నడిపితే వాణిజ్య, ప్రయాణికుల పరం గా ఉపయుక్తంగా ఉండదని.. ఈమార్గం సికింద్రాబాద్ స్టేషన్ వరకు పూర్తయితేనే మెట్రో రైళ్లు నడపాలని గతంలో నిర్ణయించింది. అయితే ఈ రూట్లో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం ఆలస్యమౌతుండడంతో ప్రాజెక్టు జాప్యమవుతోంది. ఇక మియాపూర్–ఎస్‌ఆర్‌నగర్ రూట్ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రారంభంపై ప్రభుత్వం ఊగిసలాడుతుం డటంతో నగరవాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపుతోంది.
♦ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గం మినహా ఇతరప్రాంతాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి.
మహానగరాల్లో మెట్రో రైలు పనులు పూర్తయిన తీరిది
నగరం పట్టిన సమయం (నెలల్లో)
కోచి 45
2012లో మొదలు ..2017లో ప్రారంభం)
ఢిల్లీ 50
(1998లో మొదలు...2002లో ప్రారంభం)
బెంగళూరు 54
(2007లోమొదలు..2011లోప్రారంభం)
హైదరాబాద్ 64
(2012లో మొదలు..ఇంకా ప్రారంభంకాలేదు)