
రామచంద్ర గుహ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థికవేత్త రామచంద్ర గుహ అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ ఒక వారం సమయం ఇచ్చి లాక్‌డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల ఇక్కట్లు తగ్గేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ విభజన సమయంలో భయంకరమైన మత కలహాలు చెలరేగాయని, లక్షలాది మంది వలస వెళ్లారని గుర్తుచేశారు. హింస జరగకపోయినా ఇప్పటి పరిస్థితి మాత్రం దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. దీని దుష్పరిణామాలు సమాజంపై తప్పకుండా ఉంటాయన్నారు. కూలీలు ఇప్పట్లో మళ్లీ పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపబోరని అన్నారు.