ముంబై : వలస కూలీలు స్వస్ధలాలకు చేరేందుకు పడుతున్న ఇబ్బందులు ఇంకా సమసిపోలేదు. ముంబై నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం రైళ్ల కోసం వేచిచూసిన వేలాది మంది వలస కూలీలకు అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిరాశ ఎదురైంది. వలస కూలీలు వెళ్లాల్సిన రైలు బొరివలి స్టేషన్ నుంచి బయలుదేరుతుందని, కందివలిలో ప్రభుత్వ మైదానానికి చేరుకోవాలని ముంబై పోలీసులు సూచించారు. వారు చెప్పినట్టే ఆ ప్రాంతానికి వెళ్లిన వలస కూలీలతో యూపీకి వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయని మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో వలస కూలీలు అవాక్కయ్యారు. అధికారుల నిర్వాకంతో వలస కూలీలు భగ్గుమన్నారు.
తమ వద్ద చేతిలో చిల్లిగవ్వ లేదని ఇక్కడ నుంచి తిరిగి ఎలా వెళతామని పలువురు కూలీలు రైలు దొరికేవరకూ రైల్వేస్టేషన్‌లోనే పడుకునేందుకు ఉపక్రమించారు. మరోవైపు రైళ్లు ఏవీ రద్దవలేదని రైల్వే అధికారులు చెప్పడం వలస కూలీలను అయోమయానికి గురిచేసింది. స్వగ్రామాలకు చేరుకునేందుకు పెద్దమొత్తంలో చార్జీలు చెల్లించి ఆటోలు, వాహనాల్లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన వలస కూలీలు తమ రాష్ట్రానికి చేరుకునే రైలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment