ఎనిమిదేళ్లు దాటితే మిలటరీ శిక్షణ
వైదిక్ విచారిక్ సంస్థకు ప్రత్యేక ఆర్మీ
- మథుర ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు
- రాం వృక్ష యాదవ్‌తోనే భారత్‌కు విముక్తి అని పిల్లలకు పాఠాలు
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులపై దాడి చేసిన ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థ సొంత సైన్యాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో భాగంగా.. చిన్నారుల చేతికే తుపాకులిచ్చి శిక్షణ ఇస్తోందని యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ఎనిమిదేళ్ల చిన్నారులకు తుపాకులిచ్చి.. లక్ష్యాన్ని గురిపెట్టి కాల్చటంలో శిక్షణనిస్తున్నారు. బాంబులు రువ్వటం, ప్రత్యర్థులపై రాళ్లతో దాడిచేయటం వంటివీ నేర్పిస్తున్నారు. ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకుని సమాంతరంగా జైళ్లు, న్యాయ వ్యవస్థను నడుపుతున్నారు. ప్రత్యేకంగా సైనిక దళం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఈ ప్రాంతంలో దాక్కున్న పెద్లోళ్లను జైళ్లకు, చిన్నారులను పునరావాస కేంద్రాలకు పోలీసులు తరలించారు. పోలీసులపై దాడి సమయంలో తమ చుట్టూ బాంబులున్నాయని.. వీటిని పోలీసులపైకి రువ్వుతూనే ఉన్నారని చిన్నారులు తెలిపారు. ‘గొడవ మొదలవగానే.. మేం చెట్ల వెనక దాక్కున్నాం. మా చుట్టూ బాంబులున్నాయి. మా వాళ్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. రెండువైపుల నుంచి తుపాకులతో కాల్పులు జరిగాయి’ అని ఓ బాలుడు చెప్పాడు. తన ఇద్దరు సోదరులు (8 ఏళ్లు, 12 ఏళ్లు) తల్లి ఇంకా జైలులోనే ఉన్నారన్నాడు. ‘వాళ్లంతా ఒకచోట గుమిగూడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గొద్దని మా నేత చెప్పాడు.
దేనికైనా తెగిద్దాం. పోరాటం చేద్దామని అన్నాడు. అందుకు కావాల్సిన బాంబులు, ఆయుధాలను కొందరు సిద్ధం చేశారు’ అని మరో బాలుడు తెలిపాడు. పోలీసులపై దాడి జరిగినప్పుడు తమ వారి చేతుల్లో, తమ చుట్టూ బాంబులున్నాయని.. ఎటెళ్లాలో తెలియక చెట్టుచాటున నక్కామన్నాడు.‘మాకు రాం వృక్ష యాదవ్ అనే నాయకుడున్నాడు. ఆయన భారత్‌కు విముక్తి కల్పిస్తాడని మా అత్త చెప్పింది. ఆయన మనకు బంగారు నాణేలిస్తాడని.. భారత్‌లో ఆ కరెన్సీ మాత్రమే చెల్లుబాటు అవతాయంది’ అని సంకేత్ (పేరు మార్చారు) అనే బాలుడు చెప్పాడు. కాగా, ఈ గొడవల్లో రాం వృక్ష యాదవ్ చనిపోయిన విషయం తెలిసిందే.
మథుర ఘర్షణలో 29కి పెరిగిన మృతులు
మథుర: ఉత్తరప్రదేశ్ మథురలో గురువారం చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఆదివారం మరణించినట్టు పోలీసులు తెలిపారు. వీరిని గుర్తించలేకపోయామన్నారు. జవహర్‌బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా జరిగిన ఈ ఘర్షణలపై అలిఘడ్ డివిజనల్ కమిషనర్ చంద్రకాంత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు మూడు వేల మంది ఆక్రమణదారులపై 45 కేసులు నమోదు చేశామని మథుర ఎస్పీ రాకేష్‌సింగ్ తెలిపారు. వీరంతా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ సానుభూతిపరులుగా చెప్పుకొంటున్న ‘ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందినవారని వెల్లడించారు. ఆందోళనకారుల బృందానికి నాయకత్వం వహించిన రామ్ వృక్ష యాదవ్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకొనేందుకు ఆర్థికంగా సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు చంద్రకాంత్ చెప్పారు. ఘటన రోజు జరిపిన కాల్పుల్లో మృతిచెందినవారిలో రామ్ వృక్ష కూడా ఉన్నాడు. ఈ ఘర్షణల నేపథ్యంలో అఖిలేశ్‌యాదవ్ సారథ్యంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ హింసకు రాష్ట్ర మంత్రి, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోదరుడు శివపాల్‌సింగ్ యాదవ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని యూపీకి చెందిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి డిమాండ్ చేశారు.