
వచ్చే ఏడాది జనవరిలో ఎంఐఎం మహిళా శాఖ
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో ఆ పార్టీ తొలి మహిళా శాఖను నగరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముస్లిం మహిళల సారథ్యానికి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనలో భాగంగాపూ ఈ శాఖను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాలకు చెందిన మహిళల సమస్యలపై చర్చించి వారికి న్యాయం జరిగేలా చేస్తామని ఇటీవల బైకలా నియోజక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే వారిస్ యూసుఫ్ పఠాన్ తెలిపారు.
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పఠాన్ తెలిపారు. మిహ ళా శాఖను తొలుత రాష్ట్ర రాజధానిలో ప్రారంభిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పార్టీ హైదరాబాద్‌లో పుంజుకుంటోందని, తాజాగా మహారాష్ట్రంలో రెండు స్థానాలు గెలుచుకోవడం ఇది శుభ సూచకమని ఆయన పేర్కొన్నారు.