మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్
ముంబై: సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడితే ఎప్పుడు క్లియర్ అవుతుందా అని అందరూ అలాగే చూస్తుండిపోతారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తుంటారు. అయితే రాష్ట్ర మంత్రి చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక జల్గావ్‌లో మార్గంమధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే స్పందించిన మంత్రి గిరీశ్ మహాజన్ తన కారు నుంచి దిగి భారీ ట్రక్కు వద్దకు పరుగులు తీశారు. మంత్రిగారు ఎందుకు పరుగెడుతున్నారో తెలియక అధికారులు అయన భద్రత దృష్ట్యా కంగారు పడ్డారు.
రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉన్న 14 చక్రాల భారీ వాహనాన్ని ఎక్కి రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖల మంత్రి గిరీశ్ డ్రైవర్ అవతారం ఎత్తారు. రోడ్డుపై అడ్డంగా ఉండి ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ట్రక్కును క్షణాల్లో నడిపి పక్కకు తీసుకెళ్లి ఆపేశారు. దీంతో అందరూ ఆయన చేసిన పనిని ప్రశంసించారు. తన భద్రత విషయాన్ని పక్కనపెట్టి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం అక్కడ చర్చనీయాంశమైంది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ పోలీసులు పట్టుకుంటారని భయపడి ట్రక్కును రోడ్డుపై నిలిపి పారిపోయాడు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంత్రి చర్య వల్ల ట్రాఫిక్ నిమిషాల్లో క్లియరైంది. అనంతరం ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.